దేశంలో పెరుగుతున్న కోవిడ్ కేసులు

 *దేశంలో కొన్ని ప్రాంతాల్లో కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ హెచ్చరించింది.*


ఈ మేరకు శుక్రవారం తెలంగాణ సహా ఐదు రాష్ట్రాలకు లేఖలు రాసింది. వారం రోజులుగా దేశంలో కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయని, తెలంగాణలోనూ కేసులు పెరుగుతున్నట్లు తాము గుర్తించామని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్రకూ ఆయన లేఖలు రాశారు. కాగా, దేశంలో దాదాపు మూడు నెలల తరువాత ఒక్కరోజులో 4 వేల పాజిటివ్‌ కేసులు శుక్రవారం నమోదయ్యాయి.



గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 4,041 పాజిటివ్‌ కేసులు రాగా, 10 మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. పాజిటివ్‌ కేసులు ఎక్కువగా ముంబై, చెన్నై వంటి మెట్రో నగరాల్లోనే నమోదవుతున్నట్లు తెలిపింది. ఇక రాష్ట్ర ఆరోగ్యశాఖ ఇచ్చిన వివరాల ప్రకారం తెలంగాణలో టెస్ట్‌ పాజిటివిటీ రేటు 0.4 నుంచి 0.5 శాతానికి పెరిగినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి లేఖలో పేర్కొన్నారు. వారం రోజుల్లో దేశవ్యాప్తంగా 21,055 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, తెలంగాణలో 375 నమోదయ్యాయన్నారు. అంతకంటే ముందటి వారం దేశంలో 15,708 కేసులు, తెలంగాణలో 287 కేసులు నమోదైనట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు కరోనా నిబంధనలు పాటించేలా చూడాలని, టెస్టింగ్‌, ట్రేసింగ్‌, ట్రీటింగ్‌, వ్యాక్సినేషన్‌ వ్యుహాలను పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. మరోవైపు శుక్రవారం రాష్ట్రంలో కొత్తగా 49 కొవిడ్‌ పాజిటివ్‌లు నమోదయ్యాయి. మొత్తం యాక్టివ్‌ కేసులు 520 ఉన్నట్లు వైద్యశాఖ వెల్లడించింది.